మేము మొదటిసారి - నా చిన్నప్పుడు మేము ఉంటున్న ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్ళాము వేసవి సెలవుల్లో, విహార యాత్ర లాగా. మామయ్య ఉదయం 7 లోపు ఇంటి నుంచి బయటపడితే అనకాపల్లి వెళ్లి ఆఫీస్ చూసుకుని తిరిగి ఇల్లు చేరేటప్పటికి రాత్రి 8 అయ్యేది. అత్తయ్య ఇంటి దగ్గర్లోనే ఒక చిన్న స్కూల్ లో టీచర్ గా పనిచేసేది. ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్స్ కూడా చెప్పేది. చాలా డైనమిక్.
ఒక రోజు మధ్యాహ్నం నుంచి జూ కి బయలుదేరాము. రాత్రి వచ్చేసరికి ఎంత అవుతుందో తెలియదు.
ఇంటికి తాళం వేసి బయలుదేరాము. మామయ్య దగ్గర ఇంకో తాళం ఉంది. మేము ఎక్కడికి వెళ్ళామో మామయ్యకి ఎలా తెలియాలి ? ఆ రోజుల్లో మొబైల్ కాదు, ల్యాండ్ లైన్ కాదు - ఏవీ లేవు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఎవరూ అందుబాటులో లేరు,
వేసవి సెలవులు అవడం వల్ల.
తాను పిల్లలకి పాఠాలు చెప్పే చాక్ పీసు తో - తాళం తీసే వాళ్ళకి కింద కనిపించేలా 'zoo' అని రాసింది అత్తయ్య.
ఇప్పుడు గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది, ఎంత వివేకం - ఎంత సమయ స్ఫూర్తి కదా అత్తయ్యకు !
టెక్నాలజీ ఇంత అద్భుతంగా పెరిగిన రోజుల్లో ఇది చిన్న విషయమే కావచ్చు. కానీ ఏ పరికరాలు లేని ఆ రోజుల్లో అత్తయ్య లాంటి సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు ఇలా ఎన్ని సమస్యలు పరిష్కరించి ఉంటారు ?
ఎంతమంది వ్యక్తుల వివేకమనే ఆస్తి మానవాళికి ఇంత పురోగతిని అందించింది, ఇన్ని ఆవిష్కరణలకు కారణమయ్యింది ?
No comments:
Post a Comment