Monday, November 18, 2024

తొలి పంట

మొదటిది ఎప్పుడూ శాశ్వతంగా గుర్తుండిపోయే విషయమే !

పుట్టినప్పుడు తొలి అడుగు (అమ్మా నాన్నలకి గుర్తుఉంటుంది), బడిలో తొలి రోజు, టీనేజ్ లో తొలి ఆకర్షణ, ఉద్యోగంలో చేరాక తొలిజీతం, పెళ్లయ్యాక తొలి రోజులు, తొలి సంతానపు తొలకరి అడుగులు - ఆ అనుభవాలు మంచి అయినా, చెడు అయినా ముద్ర వేస్తాయి - చాలా బలంగా.

కోవిడ్ జీవితపు విలువని అందరికీ గుర్తు చేసింది. మొక్కలు పెంచడం, పువ్వులు పూయించడం (ప్రకృతి మాత పూయిస్తుంది కానీ మనమే చేశాము అనుకుంటాము) మొదలుపెట్టాము నేను, నా భార్య.

తొందరలోనే చిన్న భూమి కొనుక్కుని కూరగాయలు, పండ్లు పండించుకోవాలి అనే దిశలో అడుగులు వేశాము. ఊరికి దూరంగా చిన్న భూమి కొని సాగుకు సిద్ధం చేశాము.

భూమిలో తొలి పూజ, తొలిసారి భూమిని దున్నడం, మడులు కట్టడం, విత్తనాలు చల్లడం, నీరు పారించడం, కలుపు తియ్యడం అంతా అపురూపమే. చిరు మొలకలు వచ్చిన రోజు - మా లోపల ఎంత ఉద్వేగం అంటే - ఇంకొక సంతానం కలిగినంత.

కీరాలు, సొరకాయలు చిన్న పిందెలు వచ్చాయి. ఎగిరి గంతులు వేశాము. తరువాత 15 రోజుల్లో కోతకి వస్తాయి.

15 రోజుల తర్వాత వెళ్ళగానే సొర కాయలు కొన్ని సగం సగం తినేసి ఉన్నాయి, కీరాలు కూడా పూర్తిగా పాడయిపోయి ఉన్నాయి. పనివాళ్ళు చెప్పారు -"ఎలుకలు సొరకాయలు కొట్టేశాయి, నెమళ్లు కీరాలను తిని వెళ్లాయి" అని.

ఒక్కసారిగా మా ఉత్సాహం మీద నీళ్లు చిలకరించినట్టు అయ్యింది. సొంతగా కూరగాయలు పండించుకుని తిందాం అంటే ఈ ఎలుకలు, నెమళ్లు పొట్టన పెట్టుకున్నాయి అని తిట్టుకున్నాను. 

తెలంగాణా లో చాలా పల్లెటూర్లలో నెమళ్లు విషపు గుళికలు తిని చనిపోయినట్లు చాలా సార్లు వార్తలు చదివాను. 'పరిస్థితి ఇలా ఉంటే రైతులు మాత్రం ఏం చేస్తారు?' అని అనిపించింది అప్పుడు నాకు.

మా నాన్న అప్పుడే కాల్ చేశారు. నిరాశగా తోటలో పరిస్థితిని చెప్పాను. 

'ఇప్పుడు ఏమయింది, ఇన్ని జీవులకు తిండి పెట్టే అవకాశం నీకు ఇంకో రకంగా దొరుకుతుందా ? ఇలా పోషించే అవకాశం అమ్మవారు ఇచ్చారు. ఆనందించు' అన్నారు నాన్న.

"నిజమే ! నేను దుఃఖ పడకూడదు. శాంతిగా ఉండాలి. ఒక మామూలు మనిషిగా ఆలోచించకూడదు. ఒక అమ్మలానో, నాన్న లానో ఆలోచించాలి" అని తృప్తిగా నేల మీద కూర్చుండి పోయాను.

Wednesday, September 11, 2024

వాడు చచ్చిపోవాలి

 అందరిలాగే నా ఉద్యోగం నా జీవనాధారం.

కష్టపడి పని చేసేవాళ్ళకి ఎప్పుడూ విలువ ఉంటుంది అని నమ్మే 80 వ దశకపు మనిషిని నేను. ఉద్యోగంలో చేరిన మొదటి మూడేళ్లు మినహాయిస్తే తర్వాత ఎప్పుడూ నాకు నేను తట్టుకోలేనంత విమర్శలు, విపత్కర పరిస్థితులు రాలేదు. ఎంత సమస్య వచ్చినా నా ఆలోచనకి, పరిశ్రమకి లోబడి పరిష్కారం అయ్యేది. 2005 లో మొదలైన ఉద్యోగ జీవిత 2023 వరకు అలాగే సాగింది.

2023 నాకు చాలా పాఠాలు నేర్పింది. నేను ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయ్యి బెంచ్ మీదకు వచ్చాను. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే చేజారాయి. కంపెనీ వాళ్ళు రిజైన్ చేయమంటే బయట IT కి గడ్డు కాలం ఉన్న పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువయ్యింది.

అనుకోకుండా నేను ఒక ప్రాజెక్ట్ లో సెలెక్ట్ అయ్యాను. నేను మునుపు ఊహించని కష్టమైన వాతావరణాన్ని తట్టుకుంటూ నెమ్మదిగా నిలబడ్డాను అనుకున్న సమయంలో 'అతను' ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాడు.

'అతను' చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అతను కానీ నా సమాన స్థాయిలో ఉన్న role లో జాయిన్ అయ్యాడు. రావడం రావడమే కొలీగ్ తో ఉన్నట్టు కాకుండా నన్ను తన సేవకుడిలా ట్రీట్ చెయ్యడం మొదలుపెట్టాడు. మహా రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వాడు. ఒక రకంగా నన్ను 'సమర్ధత' లేని వాడు అని ప్రూవ్ చేసే పనిలో పడ్డాడు.

'అతని' నుంచి ఒక మెసేజ్ కానీ, మెయిల్ కానీ వస్తే ఒళ్ళు ఝల్లుమనేది. దాని వెనక ఏమి పథకం ఉందో తెలుసుకోవడానికి నా శక్తి సామర్థ్యం ఖర్చు అయ్యేవి. 'అతని' రాజకీయాల నుంచి నన్ను కాపాడేవారు ఎవరూ ఉండరు అని ఆర్త్గం అయ్యింది.

'దేవుడా, నేను ఎప్పుడూ కష్టపడి పనిచేశాను కదా. ఎవరి పొట్టా కొట్టలేదు కదా. నాకెందుకు ఈ కష్టం. ఊరుకుంటావే ? నన్ను రక్షించవే ? నిజంగా నా బాధలో నిజం ఉంటే వాడు కోలుకోలేని దెబ్బ తినాలి. వాడు చచ్చిపోవాలి' అని తిట్టుకున్నాను.

ఇలా రోజులు దొర్లుతున్నాయి. ఒక రోజు మాటల మధ్యలో ఒక పై అధికారి చెప్పారు - "కంపెనీ లో పాలసీ మారిపోయింది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా - ఏదో ఒక ప్రాజెక్ట్ లో బిల్లింగ్ ఉండాలి. లేదంటే వారిని కంపెనీ నుంచి బయటకు పంపించేస్తారు. 'అతను' కూడా అలాగే మా ప్రాజెక్ట్ లో రక రకాల ప్రయత్నాలు చేసి, జాయిన్ అయ్యి, తన ఇంపార్టెన్స్ ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు" అని.

అందరిలాగే 'అతనిది కూడా 'మనుగడ కోసం పోరాటం' అన్నమాట ! ఎవరు బయటికి ఎంత ఫోజులు కొట్టినా ఇది అంతా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే ప్రయత్నం లో భాగం అన్నమాట.

'అతన్ని' శాపనార్ధాలు పెట్టుకున్నందుకు సిగ్గు పడ్డాను. జాగరూకత తో నా పని నేను చేసుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాను.

Tuesday, September 10, 2024

ఆధ్యాత్మిక పరిణితి అంటే ...

నాకు రావాల్సిన వయసులో ఉండాల్సిన ఆధ్యాత్మిక ఆలోచనలు వచ్చాయని నేను ఎప్పుడూ సంతోషంగా అనుకునే వాడిని. 

ఒక సెలవు రోజు నేను నా భార్య పిల్లలతో ముషీరాబాద్ వైపు వెళ్లాను. మధ్యాహ్నం కామత్ హోటల్ లో తిని ఆ చుట్టు  పక్కల ఊరిని పిల్లలకి చూపించాలని ప్లాన్. 

హోటల్ నుంచి బయటికి వచ్చాక - సగం నిండుగా ఉన్న వాటర్ బాటిల్ చేతిలో పట్టుకుని - పిల్లల్ని బిర్లా మందిర్ కి తీసుకెళ్లాలని రోడ్ పక్కగా నడుస్తూ ఉన్నాము. గుడి తెరవడానికి ఇంకా కొంచెం సమయం ఉంది. 

హఠాత్తుగా నా దృష్టి రోడ్ కి, పేవ్ మెంట్ కి మధ్య ఉన్న చిన్న ప్లేస్ మీదకి మళ్లింది. అక్కడ ఒక పిల్లి పిల్ల తలకి దెబ్బ తగిలి మరణ యాతన పడుతోంది. అంత బిజీ రోడ్ లో ఏదో వాహనం ఢీ కొట్టినట్టు ఉంది. తల నుంచి రక్తం కారుతోంది. నాకు గుండె కలచివేసింది. దానికి దగ్గర్లో ఒక పాన్ షాప్ ఉంది, ఇద్దరు వ్యక్తులు ఆ పిల్లిని చూస్తున్నారు కానీ వాళ్లలో వాళ్ళు ఏవో మాట్లాడుకుంటూ ఉండిపోయారు. 

'నేను ఏమి చెయ్యాలి ?' అని ఒక్క క్షణం ఆగి, నేను ఏమీ చెయ్యలేను అని నిర్ధారించుకుని - ఒక వేళ నేను ఒక వీధి పిల్లి గురించి ఏమన్నా చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు - నా భార్య పిల్లలు ఏమనుకుంటారు అనుకుని - బాధగా ఉన్నా కూడా ముందుకు వెళ్ళిపోయాను.  

బిర్లామందిర్ కొండ ఎక్కి, గుడికి వెళ్లి బయట కొద్ది సేపు కూర్చున్నాము. సాయంత్రం అయ్యింది. 

"మీ మొహం బాగా మాడిపోయినట్టుగా ఉంది ఏమిటి ?" అని నా భార్య అడిగింది. 

నేను మధ్యాహ్నం రోడ్ మీద రక్తం ఓడుతున్న పిల్లి సంగతి చెప్పాను. 

"ఆ సంగతి మీరు ఇప్పుడా చెప్పేది ? అప్పుడే చెప్పి ఉండచ్చు కదా" అన్నది. 

"చెప్తే మాత్రం మనం ఏమి చెయ్యగలిగే వాళ్ళం ? ఈ మహా నగరంలో రోజూ అలా ఎన్నో మూగ జీవులు ప్రమాదాల్లో చనిపోతున్నాయి. వాటిని మనం ఏమి చెయ్యగలం ? మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేసి చెప్తే పట్టించుకుంటారా ? ఒక వేళ ఇంకేమన్నా చేద్దామన్నా మీరు నాది చాదస్తం, అతి జాలి అనుకోరా ?" అని అడిగాను. 

"అలా  ఎందుకు అనుకుంటాము ? మనం వాటిని బ్రతికించలేక పోవచ్చు. మీ చేతిలో వాటర్ బాటిల్ ఉంది. ప్రాణం పోతున్న పిల్లికి ఒక గుక్కెడు నీళ్లు అన్నా పొసే వాళ్ళం కదా !" అన్నది నా భార్య. 

నా ఆధ్యాత్మిక పరిణితి మీద నాకున్న భ్రమలు తొలగిపోయాయి. ఇంత చిన్న ఆలోచన నాకు రానందుకు నేను సిగ్గు పడ్డాను. 

ఆ తర్వాత కనీసం ఒక వారం రోజుల పాటు చాలా తీవ్రంగా, ఆ మాటకొస్తే ఇప్పటికి కూడా - ఆ పిల్లి పిల్ల మరణ యాతన పడుతున్న దీనమైన కళ్ళు నన్ను సూటిగా చూస్తున్నట్టు ఉంటాయి. నా లోలోపల నిద్రాణమైన ప్రేమని, కరుణని - నిద్రలేపుతున్నట్టు ఉంటాయి. 

Monday, September 9, 2024

సంస్కారం వెక్కిరించింది

 నా ఇంటర్ డిగ్రీ రోజులు అన్నీ విజయనగరం లో మా ఇంటి నుంచి వేరే ఊర్లకు ప్రతి రోజు వెళ్లి చదువుకున్నాను. రోజూ ప్రయాణం చేసేటప్పుడు నాతో పాటు వచ్చే చాలా మంది ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుకుంటూ, మంచి విషయాలు డిస్కషన్ చేస్తూ ప్రయాణం ఎప్పుడు అయిపోయిందో కూడా తెలిసేది కాదు.


నేను బుద్ధి మంతుడిని అని నా విశ్వాసం. నా చుట్టూ అనేకమైన అల్లరి చిల్లర టీనేజెర్స్ ఉన్నారు, నేను పవిత్రమైన ఆలోచనలు కలవాడిని అని నా గట్టి నమ్మకం.


ఒక రోజు మేము ఎక్కిన బస్ దారి మధ్యలో చాలా రష్ గా అయ్యింది. మేము వెనక సీట్స్ లో కూర్చున్నాము. దారిలో ఒక పల్లెటూరిలో చాలా మంది ఎక్కారు. ఒక పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి నా సీట్ పక్కన నిలబడింది. బస్ నడుస్తోంది. నా ముందు సీట్ మీద చెయ్యి వేసి నేను కూర్చుని ఉంటే సడెన్ గా నా చెయ్యి మీద చెయ్యి వేసింది. నా చెయ్యి పక్కకి జరిపాను. ఇలా ఒక రెండు సార్లు అయ్యింది. నాకు ఆ అమ్మాయి ప్రవర్తన కి చికాకు వేసింది.


మధ్యలో డ్రైవర్ ఒక మాదిరి బ్రేక్ వేశాడు. ఆ అమ్మాయి కింద పడబోయి నా ఒళ్ళో పడింది. ఆ అమ్మాయి వెంటనే లేచింది. నాకు తన మీద అసహ్యం వేసింది. 

ఆ అమ్మాయి ప్రశాంతంగా ఉంది, బయటకు చూస్తోంది. ఆ పావుగంట - అరగంట ఆ అమ్మాయిని తిట్టుకుంటూ గడిపాను. మా కాలేజ్ ఉన్న ఊరు వచ్చింది. అందరం అక్కడే దిగాము. ఆ అమ్మాయి, వాళ్ళ వాళ్ళు కూడా దిగి మాకు రివర్స్ డైరెక్షన్ లో వెళ్తున్నారు అని గమనించాను.


"ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో ? నా పక్కన నిలబడ్డ అమ్మాయి నా చెయ్యి మీద చెయ్యి వేస్తూనే ఉంది, డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు నా ఒళ్ళో కూడా పడింది. ఛీ ఛీ" అన్నాను.


"అన్నా, పాపం నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావ్. ఆ అమ్మాయి కాలికి సొట్ట ఉంది. పాపం అన్నా !" అన్నాడు నా పక్కనున్న మా జూనియర్.


అటు తిరిగి చూశాను. తన కాలు అవిటి. నాకు మనస్సు చివుక్కుమంది.  (కుహనా) సంస్కారం ముసుగులో నా కళ్ళు మూసుకుపోయాయి. ఒక్క క్షణం నిశితంగా గమనిస్తే ఆ అమ్మాయికి సీట్ ఇచ్చేవాడిని కదా !


మరీ ముఖ్యంగా ఆమె గురించి తప్పుగా ఆలోచించే వాడిని కాదు కదా ! నేను పాతాళం లోకి పడిపోతున్నట్టుగా నాకు అనిపించింది. నా సంస్కారం నన్ను వెక్కిరించింది.

ఇల్లు ఖాళీ చేసింది

 అమ్మమ్మ  ఇల్లు - అందరు పిల్లల్లాగే మాకు కూడా అత్యంత అందమైన జ్ఞాపకం. 

ప్రతి సెలవులకు ఇటు అమ్మా వాళ్ళ పుట్టింటికి, అటు నాన్న వాళ్ళ సొంత ఇంటికి వెళ్లడం మా అలవాటు. 

"ఆంధ్రా ప్యారిస్ - తెనాలి" - మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మేము చిన్నప్పటి నుంచి అమ్మమ్మ గారాబం, పిన్నుల ఆదరణ అపరిమితంగా పొందిన అదృష్టవంతులం. మా అమ్మవైపు ఉన్న మా కజిన్స్ అందరికీ తెనాలితో ఎవరికి వారికి ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 

విమానం మేడ, స్వరాజ్ - రాజ్యం - సత్యన్నారాయణ - రత్నా - ప్రియా డీలక్స్ - రామకృష్ణ - గెయిటీ సినిమా హాల్స్, చినరావూరు  పార్క్, వైకుంఠ పురం గుడి, కన్యకా పరమేశ్వరి గుడి, చిట్టి ఆంజనేయ స్వామి గుడి, మార్కెట్, చిన్న రసాలు, ఆర్ట్ ఎక్సిబిషన్స్ - తెనాలి ఒక అద్భుతం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన శుభ కార్యాలు ఎక్కువగా జరిగింది సుబ్రహ్మణ్య కల్యాణ మండపంలో. అక్కడ మా ఆటలకు, సందడికి లెక్క లేదు. 

నేను తెనాలి లో అడుగు పెట్టిన వెంటనే చేసే మొదటి పని - మా చిన్న పిన్నిని తీసుకుని బజారుకెళ్లి - కార్ బొమ్మ కానీ, బస్సు బొమ్మ కానీ కొనిపించుకోవడం. ఒక వేళ అలా కొనుక్కోవడం కుదరని రోజు ఏదన్నా వస్తువు కొనగా వచ్చిన చిన్న అట్ట పెట్టెని తీసుకుని దానికి కిటికీలు తలుపులు పెట్టి బస్సు లాగా ఆడేవాడిని. 

అమ్మమ్మ ఇంట్లో ప్రతి నాపరాయి, వాటికి వేసిన సిమెంట్ ప్యాచ్ అన్నీ నాకు జ్ఞాపకం. 

కాలేజ్ చదువుకి వచ్చాక తెనాలి వెళ్ళడం తగ్గింది కానీ - తెనాలితోమా బంధం తెగలేదు.  అమ్మమ్మ తాతయ్య పిల్లల ఇళ్ళకి తిరుగుతూ ఉన్నా కూడా - మామూలుగా తెనాలి లోనే ఉండేవాళ్ళు. 

అమ్మమ్మ వెళ్ళిపోయింది, ఇల్లు ఖాళీ చేసేసింది. తాతయ్య మామయ్యల ఇళ్లకు వచ్చేశారు. 

ఇంక తెనాలి వెళ్లే అవకాశం లేదని అర్థమయ్యాక - అమ్మవాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు - అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మేసి - ఉన్న సామాను మొత్తం ఖాళీ చెయ్యడానికి వెళ్ళారు. 

నేను ఆ సమయంలో విజయనగరంలో మా ఇంట్లోనే ఉన్నాను కానీ - అమ్మమ్మ సంతానం అందరి గురించి నా మనసులో బాధ విపరీతమయ్యింది. వీళ్ళు అందరూ పుట్టి పెరిగిన ఇల్లు, ఎన్నో శుభకార్యాలు జరిగిన ఇల్లు - ఖాళీ చేస్తున్నామని ఒక్కొక్కరు ఎంత  బాధ పడుతున్నారో అని నాకు గుండె కోసినట్టుగా అనిపించింది. ఆ ఎనిమిది మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల బాధ ఆ రోజు నేను ఒక్కడినే అనుభవించాను. 

తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక 15 ఏళ్ళ తర్వాత మా పిన్ని కొడుకు ప్రత్యేకంగా కుదుర్చుకుని తెనాలి వెళ్లి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉన్న ప్రాంతాన్ని ఫోటోలు, వీడియోలు తీసి పంపాడు. 

అప్పటి అందం లేదు. అక్కడ ఒక అపార్టుమెంట్ వచ్చింది. మాకు గుర్తు ఉన్న ఒక్క చిహ్నం కూడా ఇప్పుడు లేదు. 

ఒక కాలువలో కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్ళిపోతుంది. అదే నీరు కావాలంటే దొరకదు. 

అమ్మమ్మ ఇల్లు ఖాళీ చేసేసింది. ఆ ఇంట్లో - ఇటుకలు ఉన్నాయా, స్మృతులు ఉన్నాయా, ప్రేమలు పోరాటాలు ఉన్నాయా ? ఏమో ! అమ్మమ్మ ఇల్లు చివరికి మా మనసులో మధురమైన ఆలోచనగా మాత్రమే మిగిలి ఉంది.

నాది కాని ఊరు

నాకు ఊహ తెలిసినప్పటినుంచి నా ప్రపంచం వైరా అనే ఒక పల్లెటూరు - ఖమ్మం జిల్లాలో. 

అమ్మ నాన్నగుంటూరు జిల్లా వాళ్ళు అయినా ఉద్యోగ రీత్యా ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. నా స్కూల్ డేస్, ఫ్రెండ్స్, ఆటలు, మాటలు, పాటలు - యవ్వనంలో అడుగుపెడుతున్న రోజులు - అన్నీ అక్కడే గడిచాయి. నా స్కూల్ లో, నా వీధిలో, ఆ మాటకొస్తే ఆ పెద్ద పల్లెటూరిలో నేను చాలా మందికి తెలుసు. 

 దాదాపుగా నేను ఆడింది ఆట, పాడింది పాట. అక్కడ ప్రతివీధి, మట్టి రోడ్లు, ఇళ్ళు, బావులు కుంటలు - అన్నీ నాకు అణువణువూ సుపరిచితమే.

 మేము అద్దెకున్న ఇంట్లో మాతో పాటుగా పక్కన అద్దెకున్న అంకుల్, ఆంటీ , వాళ్ళ పసిపిల్లాడు మాతో ఫ్యామిలీ లాగా కలిసిపోయారు. 

నేను ఇంటర్ లోకి వచ్చాక అమ్మకి అక్కడికి 600 కిమీ దూరంలో ఉన్న విజయనగరం పక్కన ఒక పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. వార్త విన్నప్పుడు పెద్దగా ఫీల్ అవలేదు కానీ - మేము బయలుదేరే రోజు దగ్గర పడుతున్న కొద్దీ నాకు ఆ వార్త పిడుగులా తాకుతూ వచ్చింది. 

విజయనగరం వెళ్ళాక నేను చాలా రోజులు మనిషి ని కాలేదు. నా ప్రతి జ్ఞాపకం, ప్రతి ఆట, ప్రతి క్షణం వైరా తోనే ముడిపడి ఉంది. తొందరగా ఎవరితోనూ కలవలేక పోయాను. కాలేజ్ చదువు కుంటుతూ సాగింది. 

ఒక సారి ఏదో పని మీద వైరా వెళ్లాల్సి వచ్చింది. నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఒక 20 - 25 రోజులు పైన వైరా లోనే ఉండిపోయేలా ఏర్పాట్లు చేసుకుని వెళ్లాను. 

వైరాలో వెళ్లిన వెంటనే నన్ను చాలా మంది ఆప్యాయంగా పలకరించారు. అందరూ నన్ను బానే మిస్ అయ్యారు అనుకున్నాను, ఆనందంగా ఫీల్ అయ్యాను. 

రెండు రోజులు నాలుగు అయ్యాయి, నాలుగు రోజులు వారం అయ్యాయి, వారం 15 రోజులు అయ్యింది - అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మొదటి రోజు నన్ను పలకరించిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి నవ్వి తలతిప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము అంతకుముందు అద్దెకి ఉన్న ఇంట్లో వేరెవరో వచ్చారు. ఆ ఇల్లు మేము ఉన్నప్పుడు ఉన్నంత అందంగా నాకు అనిపించలేదు. వైరాలో ఉన్న నా చిన్న నాటి ఫ్రెండ్స్ అంతా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ పై చదువులకి పై ఊర్లకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు.

రోజులు గడుస్తున్నకొద్దీ నాకు అర్థం అయ్యింది - నా జీవితం ఎక్కడ అయితే అదే నాకు సొంతం. వైరాలో నాకు చిన్ననాటి జ్ఞాపకాలు తప్ప నా వాస్తవం లేదు అని. 

రాత్రికి రాత్రి నాలో ఈ మార్పు రాలేదు కానీ ముందున్న హృదయ భారం ఆ తర్వాత లేదు. నేను తిరిగి విజయనగరం దగ్గర మేము ఉంటున్న మా పల్లెటూరికి వచ్చేశాను - నాది కాని  ఊరిని వదిలిపెట్టి, నేను సొంతం చేసుకోవాల్సిన ఊరికి.

Friday, August 30, 2024

బండెడు పని - ఇంటెడు సంతోషం

 అది 2013 లో అనుకుంటా, మేము భార్యా భర్తలం ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాము. సొంత ఇంటి కోసం తిరిగి తిరిగి ఒక ఇల్లు ఖాయం చేసుకుని చెక్కపని మొదలుపెట్టాము.


అప్పట్లో మాకు సొంత వాహనం కూడా లేదు. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి , అన్నం వండుకుని క్యారేజ్ కట్టుకుని, ఆటో లో కొత్త ఇంటి దగ్గరికి వెళ్లి చెక్క పనులు చూసుకుంటూ, కొత్తగా కొనిపెట్టాల్సిన మెటీరియల్ అంతా కొనిపెట్టి, అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్తూ వెళ్తూ అదే ఆటోలో ఇద్దరం బ్రెడ్డు తిని - చివరికి ఆఫీస్ కి వెళ్లేసరికి చాలా లేట్ అయ్యేది.


లేటుగా ఆఫీస్ కి వెళ్ళాము కాబట్టి రాత్రి వరకు పని చూసుకుని ఇంటికి వచ్చి ఇంత వండుకుని తిని పడుకునే వాళ్ళము. ఎంతో అలసట, జీవిత కాలపు కలలు నెరవేరుతున్నాయని ఆనందం. ఇంత హడావుడి లో మా ఐదేళ్ల అమ్మాయి ని సరిగ్గా చూసుకోలేమో అని వేసవి వచ్చిన వెంటనే మా అత్తగారింటికి పంపాము.


పనమ్మాయి ఒక వారం రోజులు సెలవు అని పది రోజులు మానేసింది. మా బిజీ బిజీ రొటీన్ లో పని అమ్మాయి లేకుండా మేనేజ్ చెయ్యడం తలకు మించిన భారం అయ్యింది. ఇంటి పని ఇద్దరం పంచుకున్నా ఒక పట్టాన తెమలటం లేదు.


ఒక రోజు ఇంటికి రాగానే ఎక్కడి పని అక్కడే ఉంది. కడగాల్సిన పాత్రలు మా సహనాన్ని పరీక్షిస్తున్నాయ్. నేను పని పిల్లని బాగా తిట్టుకున్నాను. అసహనంగా ఎంగిలి పాత్రల్ని తిట్టుకున్నాను. అలా చాలా సేపు తిట్టుకున్నాక మా ఆవిడ వైపు తిరిగి అడిగాను - "ఇందాకటి నుంచి ఇంత చికాకు గా ఉంది నాకు, నీకు ఏమీ అనిపించడం లేదా ?"


తాను చెప్పింది - "ఏవండీ, శ్రమ ఎక్కువ గానే ఉంది - ఒప్పుకుంటాను. కానీ ఇన్ని ఎంగిలి పాత్రలు ఉన్నాయంటే దాని అర్థం - ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని, శుభ్రంగా వండుకుని తింటున్నారు అని, తినేది అరుగుతోంది అనే కదా ! ఇంత కన్నా మనం సంతోషించే విషయం ఏముంటుంది ?"


అంత వేడి లోనూ నా మీద చల్లని జల్లు కురిసినట్టు అనిపించింది. ఇంద్ర ధనస్సు లోని ఏడు రంగులు కలిసిపోయి చివరికి తెల్లని కాంతిగా ఎలా మారతాయి అనేది నాకు అప్పుడు అర్థం అయ్యింది.

Sunday, August 25, 2024

వివేకమే ఆస్తి

మా అత్తయ్య జగన్మాత ఒడి చేరుకుని ఎన్నో ఏళ్ళు అయ్యింది. ఇప్పటికీ తన స్ఫూర్తి నన్ను ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది.

మేము మొదటిసారి - నా చిన్నప్పుడు మేము ఉంటున్న ఖమ్మం  నుంచి విశాఖపట్నం వెళ్ళాము వేసవి సెలవుల్లో, విహార యాత్ర లాగా. మామయ్య ఉదయం 7 లోపు ఇంటి నుంచి బయటపడితే అనకాపల్లి వెళ్లి ఆఫీస్ చూసుకుని తిరిగి ఇల్లు చేరేటప్పటికి రాత్రి 8 అయ్యేది. అత్తయ్య ఇంటి దగ్గర్లోనే ఒక చిన్న స్కూల్ లో టీచర్ గా పనిచేసేది. ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్స్ కూడా చెప్పేది. చాలా డైనమిక్.

ఒక రోజు మధ్యాహ్నం నుంచి జూ కి బయలుదేరాము. రాత్రి వచ్చేసరికి ఎంత అవుతుందో తెలియదు. ఇంటికి తాళం వేసి బయలుదేరాము. మామయ్య దగ్గర ఇంకో తాళం ఉంది. మేము ఎక్కడికి వెళ్ళామో మామయ్యకి ఎలా తెలియాలి ? ఆ రోజుల్లో మొబైల్ కాదు, ల్యాండ్ లైన్ కాదు - ఏవీ లేవు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఎవరూ అందుబాటులో లేరు, 
వేసవి సెలవులు అవడం వల్ల. 

తాను పిల్లలకి పాఠాలు చెప్పే చాక్ పీసు తో - తాళం తీసే వాళ్ళకి కింద కనిపించేలా 'zoo' అని రాసింది అత్తయ్య. ఇప్పుడు గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది, ఎంత వివేకం - ఎంత సమయ స్ఫూర్తి కదా అత్తయ్యకు !

టెక్నాలజీ ఇంత అద్భుతంగా పెరిగిన రోజుల్లో ఇది చిన్న విషయమే కావచ్చు. కానీ ఏ పరికరాలు లేని ఆ రోజుల్లో అత్తయ్య లాంటి సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు ఇలా ఎన్ని సమస్యలు పరిష్కరించి ఉంటారు ? 

 ఎంతమంది వ్యక్తుల వివేకమనే ఆస్తి మానవాళికి ఇంత పురోగతిని అందించింది, ఇన్ని ఆవిష్కరణలకు కారణమయ్యింది ?