అమ్మమ్మ ఇల్లు - అందరు పిల్లల్లాగే మాకు కూడా అత్యంత అందమైన జ్ఞాపకం.
ప్రతి సెలవులకు ఇటు అమ్మా వాళ్ళ పుట్టింటికి, అటు నాన్న వాళ్ళ సొంత ఇంటికి వెళ్లడం మా అలవాటు.
"ఆంధ్రా ప్యారిస్ - తెనాలి" - మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మేము చిన్నప్పటి నుంచి అమ్మమ్మ గారాబం, పిన్నుల ఆదరణ అపరిమితంగా పొందిన అదృష్టవంతులం. మా అమ్మవైపు ఉన్న మా కజిన్స్ అందరికీ తెనాలితో ఎవరికి వారికి ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
విమానం మేడ, స్వరాజ్ - రాజ్యం - సత్యన్నారాయణ - రత్నా - ప్రియా డీలక్స్ - రామకృష్ణ - గెయిటీ సినిమా హాల్స్, చినరావూరు పార్క్, వైకుంఠ పురం గుడి, కన్యకా పరమేశ్వరి గుడి, చిట్టి ఆంజనేయ స్వామి గుడి, మార్కెట్, చిన్న రసాలు, ఆర్ట్ ఎక్సిబిషన్స్ - తెనాలి ఒక అద్భుతం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన శుభ కార్యాలు ఎక్కువగా జరిగింది సుబ్రహ్మణ్య కల్యాణ మండపంలో. అక్కడ మా ఆటలకు, సందడికి లెక్క లేదు.
నేను తెనాలి లో అడుగు పెట్టిన వెంటనే చేసే మొదటి పని - మా చిన్న పిన్నిని తీసుకుని బజారుకెళ్లి - కార్ బొమ్మ కానీ, బస్సు బొమ్మ కానీ కొనిపించుకోవడం. ఒక వేళ అలా కొనుక్కోవడం కుదరని రోజు ఏదన్నా వస్తువు కొనగా వచ్చిన చిన్న అట్ట పెట్టెని తీసుకుని దానికి కిటికీలు తలుపులు పెట్టి బస్సు లాగా ఆడేవాడిని.
అమ్మమ్మ ఇంట్లో ప్రతి నాపరాయి, వాటికి వేసిన సిమెంట్ ప్యాచ్ అన్నీ నాకు జ్ఞాపకం.
కాలేజ్ చదువుకి వచ్చాక తెనాలి వెళ్ళడం తగ్గింది కానీ - తెనాలితోమా బంధం తెగలేదు. అమ్మమ్మ తాతయ్య పిల్లల ఇళ్ళకి తిరుగుతూ ఉన్నా కూడా - మామూలుగా తెనాలి లోనే ఉండేవాళ్ళు.
అమ్మమ్మ వెళ్ళిపోయింది, ఇల్లు ఖాళీ చేసేసింది. తాతయ్య మామయ్యల ఇళ్లకు వచ్చేశారు.
ఇంక తెనాలి వెళ్లే అవకాశం లేదని అర్థమయ్యాక - అమ్మవాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు - అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మేసి - ఉన్న సామాను మొత్తం ఖాళీ చెయ్యడానికి వెళ్ళారు.
నేను ఆ సమయంలో విజయనగరంలో మా ఇంట్లోనే ఉన్నాను కానీ - అమ్మమ్మ సంతానం అందరి గురించి నా మనసులో బాధ విపరీతమయ్యింది. వీళ్ళు అందరూ పుట్టి పెరిగిన ఇల్లు, ఎన్నో శుభకార్యాలు జరిగిన ఇల్లు - ఖాళీ చేస్తున్నామని ఒక్కొక్కరు ఎంత బాధ పడుతున్నారో అని నాకు గుండె కోసినట్టుగా అనిపించింది. ఆ ఎనిమిది మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల బాధ ఆ రోజు నేను ఒక్కడినే అనుభవించాను.
తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక 15 ఏళ్ళ తర్వాత మా పిన్ని కొడుకు ప్రత్యేకంగా కుదుర్చుకుని తెనాలి వెళ్లి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉన్న ప్రాంతాన్ని ఫోటోలు, వీడియోలు తీసి పంపాడు.
అప్పటి అందం లేదు. అక్కడ ఒక అపార్టుమెంట్ వచ్చింది. మాకు గుర్తు ఉన్న ఒక్క చిహ్నం కూడా ఇప్పుడు లేదు.
ఒక కాలువలో కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్ళిపోతుంది. అదే నీరు కావాలంటే దొరకదు.
అమ్మమ్మ ఇల్లు ఖాళీ చేసేసింది. ఆ ఇంట్లో - ఇటుకలు ఉన్నాయా, స్మృతులు ఉన్నాయా, ప్రేమలు పోరాటాలు ఉన్నాయా ? ఏమో ! అమ్మమ్మ ఇల్లు చివరికి మా మనసులో మధురమైన ఆలోచనగా మాత్రమే మిగిలి ఉంది.
No comments:
Post a Comment